Thursday, September 2, 2010

వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు : మంచికంటి రాంకిషన్‌ రావు

uzz up! మార్క్సిస్టు సౌజన్యంతో

రాత్రి ఒంటిగంట వేళ..కటిక చీకటిలో 45 మంది సభ్యులున్న దళం.. పొలంగట్లపై అడుగులో అడుగు వేస్తూ బయల్దేరింది. సన్నటి యువకుడొకరు ఆ దళానికి సూచనలిస్తూ ముందుకు కదిలిస్తున్నాడు. ప్రతి అడుగూ ప్రణాళిక ప్రకారం పడుతోంది. దళం పోలీసు స్టేషన్‌ సమీపించింది. 'సన్నటి యువకుడు' వెనుక వస్తున్న దళాన్ని నిలువరించి నలువైపులా పరికించాడు. పోలీసు స్టేషన్‌ పరిసరాల్లో ఎక్కడా ఏవిధమైన కదలికలూ లేవు. పోలీసు స్టేషన్‌ వరండాలో కొయ్య మొకరానికి ఆనుకుని సెంట్రీ కానిస్టేబుల్‌ మాంచి నిద్రలో గురకపెడుతున్నాడు. దీనిని గమనించిన 'సన్నటి యువకుడు' దళానికి సైగచేశాడు. దళంలో కొందరు నెమ్మదిగా అడుగులోఅడుగు వేసుకుంటూ ముందుకు కదిలి రెప్పపాటులో సెంట్రీపై పడి అదిమిపెట్టేశారు. అతను తెప్పరిల్లి కేకపెట్టే అవకాశం లేకుండా చేశారు. దళంలోని మిగిలిన వారు స్టేషన్‌లోకి వెళ్లి ఆయుధాలు మొత్తంగా కట్టకట్టి బయటకు తెచ్చారు. అదే సమయంలో దళంలోని మరికొందరు ఆ పక్కనే ఉన్న తహశీలుదారు కార్యాలయంపైన కూడా దాడి రికార్డులనూ, డబ్బునూ బయటకు తెచ్చారు. ఈవిధంగా ఆ 'సన్నటి యువకుడు' నేతృత్వంలో కృష్ణాజిల్లా పరిటాల 'పోలీసుస్టేషన్‌, తహశీలుదారు కార్యాలయంపై దాడులు జయప్రదంగా జరిగాయి. అతడే తెలంగాణా విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్‌ మంచికంటి రాంకిషన్‌రావు.

బ్రిటిష్‌వారు దేశాన్ని ఇండియా, పాకిస్తాన్‌గా ప్రకటించి నిష్క్రమించిన తరువాత, ఇండియాలో అంతర్భాగంగాలేని నైజాం సంస్థానాన్ని నిజాం నవాబు పరిపాలిస్తున్నాడు. ఆ ముష్కరుడి పాలనలో రజాకారు మూకలు విచ్చలవిడిగా ప్రజలను దోచుకుంటున్నారు. విధ్వంసకాండకు పాల్పడుతున్నారు. ఆ మూకల అండదండలతో తమ స్థానాన్ని కాపాడుకోవాలని భూస్వామ్యవర్గం యథాశక్తి పాకులాడుతోంది. పీడిత ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు సమీకృతమై తమకు అందుబాటులో ఉన్న రాయి, రప్ప, బరిసె, వడిసెలతో ఎదుర్కొంటున్నారు. దీంతో ఆత్మరక్షణకు ప్రజలకు, ముఖ్యంగా యువతీ యువకులకు గెరిల్లా తరహా యుద్ధ పోరాట పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలని కమ్యూనిస్టుపార్టీ పిలుపునిచ్చింది. నైజాం సంస్థానానికి సరిహద్దునగల కృష్ణాజిల్లా కమ్మవారిపాలెం, మల్కాపురం గ్రామాల్లో మొదటి గెరిల్లా పోరాట శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి.

కృష్ణాజిల్లాలోని కొడవటికల్లు, కొండపేట, ఉస్తేపల్లి మొదలైన ఏడు గ్రామాలు నైజాం సంస్థానపు అంతర్భాగాలుగా ఉన్నాయి. ఈ గ్రామాలకు విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి మీద ఉన్న 'పరిటాల' తాలూకా కేంద్రంగా ఉంది. ఆయుధ సేకరణకుగాను పరిటాల పోలీసుస్టేషన్‌పై తొలిగా దాడి చేయడం ద్వారా ప్రారంభించాలని రహస్య దళాన్ని కమ్యూనిస్టుపార్టీ కోరింది. తగిన ప్రణాళికతో దాడికి రాంకిషన్‌రావు నేతృత్వం వహించారు. దళసభ్యుల తోడ్పాటుతో జయప్రదంగా పోలీసుస్టేషన్‌ నుంచి ఆయుధాలను కొల్లగొట్టాడు. ఈసారి మధిర తాలూకా మోటమర్రి సమీపానగల విజయవాడ-ఖాజీపేట రైల్వేమార్గంపై గేటు కాపలాకాస్తున్న 'నిజాం మిలిటరీ' మీద దాడి చేసి రైఫిళ్లనూ, మందుగుండు సామాగ్రి పెట్టెను తీసుకుపోయారు. నిజాం సంస్థాన అధీనంలోని దాదాపు 40 గ్రామాలవారు కృష్ణాజిల్లాలోకి ప్రవేశించడానికి మోటమర్రి రైల్వే గేటు అనువుగా ఉంది. దీనిమీదుగా వాహనాలతో తరలి వెళ్లే ప్రజలను దోచుకోవడం, హింసించడం మిలటరీకి నిత్యకృత్యమైంది. ఆయుధ సేకరణతోపాటు వాళ్ల ఆటకట్టించడానికి నిజాం పోలీసు మిలిటరీ బలగాలపై దాడిచేయాలని రాంకిషన్‌రావును పార్టీ కోరడంతో ఈ దాడి నిర్వహించారు. తర్వాత కొన్నాళ్లకు మధిర తాలూకా గన్నవరం పోలీసు క్యాంపుపై దాడి చేశారు.

ఒకరోజు మన్నెంగూడెం నుండి పొలాల మీదుగా నడిచి వస్తుండగా భూస్వాములకు చెందిన పొలాల్లో ఇద్దరు గూండాలు ఘర్షణ పడుతున్నారు. ఇద్దర్నీ చెరి రెండువేసి వారి వద్ద ఉన్న రివాల్వర్లు తీసి నడిపిస్తుండగా 50 మంది అశ్వికదళ సైన్యం అటుగా వస్తోంది. వారిని చూడగానే పక్కనున్న గూండాలు పారిపోయి రాంకిషన్‌రావు గురించి సైన్యానికి చెప్పారు. దీంతో రాంకిషన్‌రావు మరో దిక్కువైపు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముందు ఆయన. వెనుక 50 మంది అశ్విక దళ సైన్యం. ఆయన ఎటు వెళ్తే అటే ఆశ్విక దళాన్ని దౌడు తీయిస్తోంది మిలటరీ. వారికి ఆయన చిక్కితే గుర్రాలతో తొక్కించి చంపేస్తారు. అయినప్పటికీ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టి తప్పించుకుంటే వస్తూ వస్తూ ఆ సమీపంలోని పశువులకాపరుల్లో కలిసిపోయారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న కాపరులు తాము అందించిన దుస్తులు ఆయనకిచ్చి ధరింపచేసినా ఆయన పోలీసులు గుర్తించలేనంతగా పశువుల కాపరి మాదిరిగా కలిసిపోలేకపోయారు. దీంతో కాపరులు అక్కడికి కొద్దిదూరంలోని గుహలోకి నెట్టి ఆ వచ్చిన వ్యక్తి ఇటు పోరిపోయాడంటూ పోలీసులకు వేరే దారి చూపారు. దీంతో ఆయన ప్రాణాలు నిలిచాయి.అనంతరం కమ్యూనిస్టు పార్టీ ఆదేశంపై దళాల నిర్మాణం, కార్యకలాపాల నిర్వహణ కోసం ఆయన మానుకోట ప్రాంతానికి వెళ్లారు.

కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో రాంకిషన్‌రావు జన్మించారు. తండ్రి పర్సా రామానుజరావు. తల్లి సీతమ్మ. కొద్దిపాటి పొలం ఉన్నా అప్పులు బాగా పెరిగిపోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. రాంకిషన్‌రావుకు ఐదారేళ్ల వయసున్నప్పుడే వారి నాన్న చనిపోయారు. రాంకిషన్‌రావుకు ఓ అక్క, అన్న కూడా ఉన్నారు. వారి పోషణభారం వారి అమ్మదే అయింది. పిల్లలు పెద్దవాళ్లయ్యే వరకూ వ్యవసాయం చేసుకొని ఫలసాయం అప్పుల కింద జమ చేసుకునేలా పొలాన్ని అప్పలవాళ్లకు అప్పగించి ఆ కుటుంబం ఖమ్మం వెళ్లిపోయింది. రాంకిషన్‌రావు తల్లి బ్రాహ్మణులకూ, వైశ్యులకూ మునేటి నుంచీ, ఖిల్లా బావి నుంచీ ప్రతిరోజూ పది బిందెల వరకూ మంచినీళ్లు మోసి వారిచ్చే కొద్ది కాసులతో కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆ కాలంలో వీరి కుటుంబ విషయం విని కాచిరాజుగూడెం భూస్వామీ, పట్వారీ అయిన మంచికంటి తిరుమలరావు రాంకిషన్‌రావును దత్తత చేసుకున్నారు. దత్తత తండ్రి సహృదయత, దత్తత తల్లి వాత్సల్యం రాంకిషన్‌రావును అసలు తల్లి, సోదరి, సోదరుడిని వారికి మరింత చేరువ చేశాయి. కాచిరాజుగూడెంలో ఇంటి వద్దనే ప్రయివేటు మాస్టారును పెట్టించి మూడో తరగతి వరకూ రాంకిషన్‌రావుకు చదువు చెప్పించారు. ఈ తరువాత పై చదువుకోసం ఖమ్మంలో పెట్టారు. దత్తత తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఖమ్మం వచ్చి వారి యోగక్షేమాలు, చదువు సంధ్యల గురించి విచారించి శ్రద్ధ వహించేవారు. ఆరవ తరగతి చదువుతుండగానే రాంకిషన్‌రావుకు వివాహమయ్యింది. హైదరాబాద్‌ వెళ్లి వకాలత్‌ చదువుకోవాలనుకున్న ఆయన అభిలాష దత్తత తల్లిదండ్రులకు సతరామూ ఇష్టం ఉండేది కాదు. వారి ఆప్యాయత అలా కట్టిపడేయడంతో ఆయన చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది.

ఇంటివద్దనే దత్తత తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ పట్వారీగిరి చేపట్టాడు. దీనితోపాటు స్వంత వ్యవసాయ భూముల వ్యవహారం కూడా తానే చూసేవాడు. పట్వారీగిరీ వ్యవహారాల్లో చాలా అవకతవకలుండేవి. వాటి లోతుపాతుల్ని తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. పట్టాలు ఒకరి పేరుతో, భూములు మరొకరి అధీనంలో, నక్షాలో ఒకరకంగా, లెక్కల్లో మరోరకంగా ఉండేవి. ఇలాంటి విషయాల్లో దత్తత తండ్రీ, రాంకిషన్‌రావు తత్వాలు భిన్నధృవాలుగా ఉండేవి. వీటి విషయంలో సర్దుబాటు చేసుకోలేని రాంకిషన్‌రావు హైదరాబాద్‌ ల్యాండ్‌ రెవెన్యూ కార్యాలయంలో చిన్న ఉద్యోగంలో చేరారు. అక్కడ ఇచ్చే 30 రూపాయల జీతం ఆయన కుటుంబానికి సరిపోయేదికాదు. ఎప్పుడూ అప్పులు చేయాల్సి వచ్చేది. అవి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. రాంకిషన్‌రావు తన భార్యను హైదరాబాద్‌లోనే వదిలేసి షోలాపూర్‌ వెళ్లి సైన్యంలో అబులెన్సు దళంలో చేరారు. ఆ సమయంలో ఆంధ్ర మహాసభలో పనిచేస్తునన జాతీయవాది కొమరగిరి నారాయణరావు రాంకిషన్‌రావు చిరునామా తెలుసుకొని పూనా వచ్చారు. తర్వాత వారిద్దరూ కలిసి మాట్లాడినప్పుడు భార్య, పెంపుడు తండ్రి పడుతున్న ఆందోళన, ఆవేదన వివరించి తిరిగి వచ్చేయాలని రాంకిషన్‌రావును కొమరగిరి కోరారు. దీనిని అర్థం చేసుకొన్న ఆయన సైన్యం శిబిరం (పూనా) నుంచి దొడ్డిదారిన హైదరాబాద్‌కు పారిపోయి వచ్చారు. పోలీసుల కళ్లబడకుండా ఉండేందుకు కొన్నేళ్లపాటు అజ్ఞాతవాసంలో గడపాల్సివచ్చింది. కొణతమాత్మకూరులో ఉన్నప్పుడు ప్రముఖ కమ్యూనిస్టు అగ్రనేతలు కామ్రేడ్స్‌ పుచ్చలపల్లి సుందరయ్య, మానికేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావులను చూశారు. వారు అప్పుడప్పుడు రాత్రిపూట 'మాభూమి' నాటక రచయిత సుంకర సత్యనారాయణ ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. రాంకిషన్‌రావు సుంకర ఇంటి పక్కనే ఉండేవారు. కొన్నాళ్లకు వారెందుకు అక్కడకు వస్తున్నారో ఆయనకు తెలిసింది.

రాంకిషన్‌రావు కొణతమాత్మకూరులోనే కమ్యూనిస్టుపార్టీ సభ్యుడయ్యారు. ఇదే ఆయన రాజకీయ జీవితానికి ఆరంభం. నిజాం నవాబుకు చెందిన రజాకార్లు, భూస్వామ్య శక్తులు.. ప్రజలపై చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు ఆయన కృష్ణాజిల్లా కమ్మవారిపాలెంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో గెరిల్లా పోరాట యుద్ధ పద్ధతుల్లో శిక్షణ పొందారు. శిక్షణ పొందాక ఎన్నో దాడుల్లో పాల్గొన్నారు. పిండిప్రోలులో దేశ్‌ముఖ్‌ జగన్నాధరెడ్డి ప్రజలపై క్రూర అకృత్యాలకు పాల్పడేవాడు. దుర్బేధ్యమైన తన గడీలో కచేరి చావడి వద్ద చెట్టుకు కట్టేసి శిక్షలను అమలు చేసేవాడు. ఆ చావడి, అక్కడున్న చెట్టుపేరు చెపితే జనం భయంతో వణికిపోయేవారు. ప్రజా సమీకరణతో ఈ దొర గడీని కూల్చివేసిన సంఘటనలో కూడా రాంకిషన్‌రావు పాల్గొన్నారు. అలాగే సంకీస పోలీసుస్టేషన్‌, మానుకోట తాలూకాలోని నెల్లికుదురు పోలీసుస్టేషన్లపై దాడిచేసిన దళాల్లో కూడా ప్రధానపాత్ర వహించారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు మృతిచెందారు. ములకలపల్లి మిలిటరీ క్యాంప్‌పై దాడిలోనూ పాల్గొన్నారు. ఇలా అనేక సాహసఘట్టాలకు ఆయన నేతృత్వం వహించారు.

రాంకిషన్‌రావు తన రాజకీయ జీవితంలో అనేకసార్లు జైళ్లపాలయ్యారు. వరంగల్‌ జైల్లో ఉన్నంతకాలం రేయింబవళ్లు కాళ్లూ చేతులకు బేడీలు వేయబడి అతి ఇరుకైన గదిలో శిక్ష అనుభవించారు. 1964లో సిపిఎం వైపు వచ్చిన ఆయన ప్రభుత్వ ఆగ్రహానికిగురై 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉండగానే ఆయన ప్రమాదకరమైన జబ్బున పడ్డారు. 1974లో అధిక ధరలకు నిరసనగా సిపిఎం ఇచ్చిన పిలుపునందుకుని నిర్వహించిన ఆందోళనకు నాయకత్వం వహించారని మరో కమ్యూనిస్టు యోధుడు చిర్రావూరి లక్ష్మీనరసయ్యతోపాటు అరెస్టు చేశారు. అంతటితో ఆగక ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారిద్దరికీ బేడీలు వేయించి ఖమ్మం పురవీధుల్లో ఊరేగింపజేశారు. తర్వాత ఆ ఖమ్మం గడ్డపైనే చిర్రావూరి మున్సిపల్‌ ఛైర్మన్‌గా, రాంకిషన్‌రావు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. 1975లో ఎమర్జెన్సీలో కూడా రాంకిషన్‌రావును రాజమండ్రి, హైదరాబాద్‌, వరంగల్‌ కేంద్ర కారాగారాల్లో నిర్బంధించారు. మళ్లీ ఆయనకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రిలో చేర్చారు. ఆ స్థితిలోకూడా ఆయనను గొలుసులతో మంచానికీ, కాలుకీ కట్టేసి హింసలపాల్జేశారు.

సిపిఎంలో రాంకిషన్‌రావు ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. 1952లో అవిభక్త కమ్యూనిస్టుపార్టీలో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, 1964 నుంచి సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, 1972 నుండి రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. 1971 నుండి 78 వరకూ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో అదే జిల్లాకు సిఐటియు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1982, 1985లో ఖమ్మం శాసనసభ్యునిగా ఎన్నికై శాసనసభలో ప్రజలవాణిని వినిపించారు. జమీందారుల దత్తపుత్రుడై సుఖసంతోషాల్లో ఓలలాడదగిన అవకాశాలున్నా వాటిని తోసిరాజనీ, పీడిత ప్రజల విముక్తి కోసం వీరతెలంగాణా సమరాంగణంలో కొదమ సింగంలా విజృంభించి, చివరికంటా ప్రజా ఉద్యమ నిర్మాణంలో ఆణిముత్యమై భాసిల్లారు రాంకిషన్‌రావు. ఆ యోధుడు 1995 ఫిబ్రవరి 8వ తేదీన కన్నుమూశారు.

No comments:

Post a Comment